Monday, 5 June 2017

GSAT-19 (on 5.6.2017)

ఇస్రో చరిత్రలో అతిపెద్ద రాకెట్.. ‘బాహుబలి’గా వర్ణించే జీశాట్-19 ఉపగ్రహం విజయవంతంగా నింగిలోకి దూసుకుపోయింది. 640 టన్నుల జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3 డి1 వాహక నౌక ద్వారా పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో రెండో ప్రయోగ వేదిక నుంచి.. సోమవారం సాయంత్రం 5:28 గంటలకు ఈ వాహకనౌకను రోదసిలోకి ప్రయోగించారు. ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 3:58 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 25:30 గంటలపాటు కొనసాగింది. 3,136 కిలోల భారీ ఉపగ్రహం జీశాట్‌-19ని భూమికి 179 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్య రేఖకు 21.5 డిగ్రీల కోణంలోని భూ అనువర్తిత బదిలీ కక్ష్య (జియోసింక్రనజ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌)కు దిగ్విజయంగా చేరవేసింది.
 
జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3 డి1ను ప్రయోగించిన 16:20 నిమిషాలలో జీశాట్‌-19 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టేలా శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ముందుగా అనుకున్నట్లుగానే 170 కిలోమీటర్లు భూమికి దగ్గరగా (పెరీజీ), 35,975 కిలోమీటర్ల దూరంగా (అపోజీ) ఉండే దీర్ఘ వృత్తాకారపు కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఇస్రో భూ కేంద్రాల నుంచి ఉపగ్రహంలోని అపోజీ మోటార్లను నియంత్రిస్తూ ఉపగ్రహాన్ని భూ స్థిర కక్ష్య (జియోస్టేషనరీ ఆర్బిట్‌)లోకి ప్రవేశపెడతారు. దేశ సమాచార రంగానికి ఈ ఉపగ్రహం 10 సంవత్సరాలపాటు సేవలు అందించనుంది.
 
తొలిసారి ‘భారీ’ ప్రయోగం
ఇస్రో తొలిసారిగా మన దేశం నుంచి 640 టన్నుల బరువుండే జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3 డి1 వాహకనౌక ద్వారా జీశాట్‌-19ని ప్రయోగించింది. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలకు నాంది పలుకుతూ ఈ భారీ ప్రయోగాన్ని చేపట్టింది. ఇది విజయవంతం కావడంతో ఇస్రోలో సంబరాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ అభినందించారు. ప్రధాని మోదీ ఇస్రో విజయాన్ని కీర్తిస్తూ అభినందనలు తెలిపారు. ఈ భారీ విజయంతో ఇకపై భారీ ఉపగ్రహాలను రోదసిలోకి ప్రవేశపెట్టేందుకు విదేశాలను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. అదే సమయంలో విదేశీ ఉపగ్రహాలను కారుచౌకగా రోదసిలోకి ప్రవేశపెట్టే సామర్థ్యం సమకూరనుంది. ఈ ప్రయోగంతో మన ఇంటర్నెట్ స్పీడ్ నాలుగు రెట్లు పెరగనుంది.